Thursday, April 21, 2022

నీ సొంత సమయం కోసం పరుగెత్తకు

☘️ అత్యాధునిక కాలములో అన్ని ఇన్స్టంట్ గా జరుగుతున్న సమయములో ప్రతిదానికి వేచి ఉండాలి అంటే మనకి చాల కష్టముగా అనిపిస్తుంది, ఒకవేళ దేవుడు ఏదైనా విషయమై వేచి ఉండమంటే ఉండటానికి మనసొప్పదు. అన్ని పనులు వెంటనే చక చక జరిగిపోవాలి అని కోరుకుంటాము. ఆలోచిస్తాము. 

☘️ రక్షించబడిన పౌలు గారు ప్రతి పట్టణములో క్రీస్తు రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తూ ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతమునకు వెళ్తున్నారు. అయితే ఆ సమయములో ఆసియాలో వాక్యం చెప్పకుండా పరిశుద్దాత్మ దేవుడు వారిని ఆటంకపరచారు. మనం అయితే ఎందుకు, ఏమిటి అంటూ దేవుణ్ణి వంద ప్రశ్నలు వేస్తాము కానీ పౌలుగారు దేవుడు చూపించిన ప్రాంతమునకు వెళ్లి సువార్త ప్రకటించడం చేసారు.. అయితే దేవుని చిత్తానుసారముగా ఒక సమయము వచ్చినప్పుడు తిరిగి అదే ఆసియా ప్రాంతములో పౌలుగారు వాక్యం ప్రకటించినప్పుడు ఇంచుమించు ఆసియా ప్రాంతమంతా వాక్యాన్ని అంగీకరించి రక్షించబడ్డారు. 

🍁 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని - అ.కార్యములు 16:6 

🍁 అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను. అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి - అ.కార్యములు 19:8-10

🍁 మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను, ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను - అ.కార్యములు 19:11,20

☘️ పలు గారు వెళ్ళాలి అనుకున్నప్పుడు పరిశుద్దాత్మ దేవుడు ఆటంకపరిచారు, కానీ దేవుని సమయమందు అక్కడ పరిచర్య చేయుట వలన ఆసియలో కాపురమున్న ప్రతి ఒక్కరికి సిలువను గూర్చిన వార్త వినిపించింది, అక్కడ దేవుని మహత్కార్యములు అనేకములుగా జరిగాయి. 

☘️ అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతిదానికి సమయము కలదు (ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగలించుటకు కౌగలించుట మానుటకు; వెదకుటకు పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు పారవేయుటకు; చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు - ప్రసంగి 3:1 - 8) అదేవిధముగా కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నారు (అ.కార్యములు 1:7) మన కాలగతులు దేవుని వశమై ఉన్నాయి (కీర్తనలు 31:15)

☘️ నడు నీవు కూడా ఆలస్యం అవుతుంది అనో, లేక ఇంకా నీవు ఆశించినది జరగటం లేదనో ఇలా ఏదొక కారణం చేత తొందరపడి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతే ఎవరినైనా లేదా దేనినైనా కోల్పోవాల్సి వస్తుందేమో అంటూ తొందరపడుతున్నావేమో.... లేక దేవునికోసం ఏదేదో చెయ్యాలి సమయం లేదు అంటూ నీ సొంత ఆలోచనలతో ఆరాటపడుతున్నావేమో.... అయితే నీ సమయం కోసం కాదు, పరిస్థితులను కాదు దేవుని సమయాన్ని చూడు, ఆయన ప్రణాళికలను చూడు.... ఆనాడు ఆసియ వెళ్లకుండా అడ్డుపడిన పరిశుద్దాత్మ దేవుడు తన సమయమందు ఆ ప్రాంతమందు సువార్త వ్యాప్తికి అనుమతి కల్పించారు. ఎప్పుడైతే దేవుని సమయమందు పౌలు అక్కడ పరిచర్య చేసారో అప్పుడు ఆసియ యందంతట దేవుని నామము మహిమపరచబడింది, దేవుని ప్రేమ అందరికి తెలియపరచబడింది. 

☘️ ఇదేవిధముగా నీవు, నేను కూడా ఎప్పుడైతే దేవుని సమయము కోసం ఎదురుచూస్తామో అప్పుడు మన జీవితములో కూడా దేవుని మహిమార్థమై అద్భుతకార్యాలు జరుగుతాయి, మన జీవితం కూడా సంతోషముతో నింపబడుతుంది....

No comments:

Post a Comment